మాజీ క్రికెట‌ర్ ఎం.వి.శ్రీ‌ధ‌ర్ క‌న్నుమూత‌

క్రికెట్ ప్రియులకు పెద్ద షాక్. హైదరాబాద్ మాజీ క్రికెటర్.. బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం పాలయ్యాడు. ఆయనకు సోమవారం తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చింది. కాసేపటి కిందటే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 51 ఏళ్లే. హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించాడు శ్రీధర్. అతను 97 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడి 49 సగటుతో 6701 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 366. ఆ ట్రిపుల్ సెంచరీ సాధించిన సమయంలో దేశవ్యాప్తంగా శ్రీధర్ పేరు మార్మోగింది. అతను భారత జట్టుకు కూడా ఎంపికవుతాడని భావించారు. కానీ ఆ అవకాశం రాలేదు.

క్రికెటర్ గా రిటైరయ్యాక శ్రీధర్ హైదరాబాద్ క్రికెట్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా పని చేశారు. హెచ్ సీఏ పరిధిలో శ్రీధర్ కు కొన్ని క్రికెట్ క్లబ్బులు కూడా ఉన్నాయి. సాఫ్ట్ వేర్ రంగంలోనూ శ్రీధర్ తనదైన ముద్ర వేశారు. సత్యం కంప్యూటర్స్ లో కీలక స్థానంలో పని చేశారు. ఆయన బీసీసీఐలో కీలక పదవిలో ఉన్నారు. అత్యంత కష్టమైన క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ పదవిలో సమర్థంగా పని చేశారు. ఐతే హైదరాబాద్ క్రికెట్ పరిధిలో క్లబ్బులున్నందుకు.. విరుద్ధ ప్రయోజనాల అంశం తెరమీదికి రావడంతో ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నాలుగు రోజుల కిందటే శ్రీధర్ ఈ పదవి నుంచి తప్పుకున్నారు. శ్రీధర్ సుదీర్ఘ కాలం ఈ పదవిలో కొనసాగుతాడని భావించారు. కానీ అనుకోకుండా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీని తాలూకు బాధ ఏమైనా ఆయన్ని ఇబ్బంది పెట్టిందేమో తెలియదు. శ్రీధర్ ఇంత హఠాత్తుగా చనిపోవడం భారత క్రికెట్ వర్గాలకు పెద్ద షాకే.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate