రేవంతే బాహుబ‌లి అట‌..ఇది వ‌ర్మ ఉవాచ‌

రాంగోపాల్ వర్మ… ఇదివరలో రాజకీయాలు పెద్దగా మాట్లాడే వారు కాదు! కానీ ఇటీవలి కాలంలో.. తాను సినిమాల గురించి మాట్లాడినా అది రాజకీయంగా మారిపోతున్న నేపథ్యంలో ఆయన చాలా తరచుగా రాజకీయాల గురించి కూడా తన అభిప్రాయాల్ని పంచుకుంటున్నాడు. వర్మ మీడియాతో ఏం మాట్లాడినా అది ఏదో ఒక కొత్త వివాదానికి చర్చకు దారితీస్తూనే ఉంటుందన్నది అందరికీ తెలిసిన సంగతే. అదే క్రమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వైనంపై ఆయన తాజాగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అనే ఫిల్మ్ థియేటర్ కు .. రేవంత్ రెడ్డి బాహుబలి లా వస్తున్నారనేది ఆయన కితాబు!

రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరడం తనకు చాలా హ్యాపీగా ఉన్నదని, రేవంత్ రెడ్డి చేరుతుండడం వలన కాంగ్రెస్ పార్టీ మీద తనకు మళ్లీ నమ్మకం ఏర్పడిందని వర్మ అంటున్నారు. రేవంత్ ను బాహుబలితో పోల్చిన రాంగోపాల్ వర్మ.. ఆ చిత్రం బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపించిన రీతిలోనే రేవంత్ కాంగ్రెస పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తాడంటూ.. ఢంకా బజాయించి ట్వీట్లు చేసేశారు.

కాంగ్రెస్ పార్టీకి బాహుబలి రేవంతేనా? అంటూ కొన్ని రోజులుగా చర్చలు సోషల్ మీడియాలో ముమ్మరంగా నడుస్తున్నాయి. గతంలో చాలా నెలల కిందట.. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్.. త్వరలోనే ఓ బాహుబలి మా పార్టీలోకి రాబోతున్నాడని చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని.. ఆ బాహుబలి రేవంతేనా? అంటూ చర్చలు సాగుతున్నాయి. ఈ విషయాన్ని జానారెడ్డి లాంటి వాళ్లు కన్ఫర్మ్ చేయలేదు గానీ.. మధ్యలో రాంగోపాల్ వర్మ తగుదునమ్మా అంటూ తలదూర్చి కాంగ్రెస్ బాహుబలి రేవంతే అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అయినా వర్మ ఇక్కడితో ఆగుతారో లేదా.. మరో అడుగు ముందుకేసి.. తాను రేవంత్ తెలుగుదేశం నుంచి నిష్క్రమణ.. మారుతున్న పరిస్థితులు అనేది సబ్జెక్టుగా.. ఓ విభిన్నమైన రాజకీయ కథాంశంతో సినిమా చేస్తానంటూ మరో బాంబు పేలుస్తారేమో అనే సరదా వ్యాఖ్యలు కూడా ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate