హ‌స్తిన‌లో కాంగ్రెస్ లో చేరుతున్న రేవంత్: రేపే ముహూర్తం

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం, వేదిక కూడా ఖరారైంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని, రాహుల్ సమక్షంలో ఆ పార్టీ సభ్యుడు అవుతారు. అయితే చేరికకు ముందే.. కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా నాయకులకు ఉండే ట్రీట్ మెంట్ ఎలాంటిదో ఆయనకు స్వానుభవంలోకి వస్తున్నది. హస్తినలో బలప్రదర్శన చేసేలా.. ఎక్కువ మంది నాయకులను వెంటబెట్టుకుని రావడం వద్దంటూ ఆయనకు అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అసలే రాహుల్ సమక్షంలో ఆయన చేరిక జరగనున్న నేపథ్యంలో 10-12 కంటె ఎక్కువ మంది నాయకులను వెంట తీసుకురావద్దని ముందే పార్టీ ఆదేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఆంక్షలా లేదా జాగ్రత్తలా అనేది మాత్రం తెలియడం లేదు.

షెడ్యూలు ప్రకారం రేవంత్ రెడ్డి అండ్ కో మంగళవారం ఉదయమే ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయనకు రాహుల్ గాంధీతో వ్యక్తిగతంగా భేటీ కి అపాయింట్ మెంట్ ఉంది. సాయంత్ర నాలుగు గంటలకు పార్టీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదంటున్న ఆయన, తనను కాంగ్రెస్ లోకి తీసుకోవడానికి 2007 నుంచి కూడా ప్రయత్నాలు జరిగాయని ఇప్పుడు వెల్లడిస్తున్నారు.

పార్టీలో ఆయనకు ఏ హోదా కట్టబెడతారనే సంగతిని మంగళవారం నాడే ఖరారు చేస్తారా? అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. రేవంత్ రెడ్డి కీలకమైన పదవులే అడుతున్నారు. ఇవ్వడానికి కూడా పార్టీ అధిష్టానం సిద్ధంగానే ఉంది. కాకపోతే.. పార్టీలో చేరిన రోజే ఇస్తారా? రేవంత్ తో కలిసి మహబూబ్ నగర్ లో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఆర్భాటంగా ప్రకటిస్తారా అనేది వేచాచూడాలి. మరోవైపు.. రేవంత్ తో పెద్దసంఖ్యలో నాయకులు హస్తినకు వెళ్లి హల్ చల్ చేసి తమ నాయకుడికి అధిష్టానం ఎదుట గుర్తింపు వచ్చేలా చేయాలని అనుకున్నారు. కానీ పదిపన్నెండు మందికి మించి వెంట తీసుకురావద్దంటూ వచ్చిన హుకుం వారిని నిరాశ పరచింది. ఆ రకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెసు పార్టీలోకి ఎంట్రీ.. కాస్త ఘనంగా, కాస్త అసంతృప్తిగా సాగుతున్నట్లు అనిపిస్తోంది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate